ప్రభుత్వ భూమిని రాయితీ ధరకు కేటాయించుకుని నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించడం తప్పనిసరి అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రాయితీపై ప్రభుత్వ భూమిని పొందిన ఆస్పత్రులు తమపై ఉన్న చట్టబద్ధమైన బాధ్యతలను తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది.
రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళకు తక్షణ వైద్యం అందించే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఆదేశాల మేరకు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సదరు మహిళను ఆస్పత్రిలో చేర్చుకుని, పేదల కోసం కేటాయించిన తప్పనిసరి 25 శాతం ఉచిత ఇన్‌పేషెంట్ కోటా కింద ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా చికిత్స అందించాల్సి ఉంటుంది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మనాల గ్రామానికి చెందిన వితంతువు బాలె భాగ్యమ్మ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కరీంనగర్‌లోని వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం బసవతారకం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే తన అనారోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని, చికిత్స ఖర్చులను తానే భరించాల్సి ఉంటుందని ఆస్పత్రి వర్గాలు తెలిపినట్లు ఆమె ఆరోపించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కీలక వాదనలు వినిపించారు. ఇది ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత చికిత్సకు సంబంధించిన విషయం కాదని, రాయితీపై ప్రభుత్వ భూమిని కేటాయించిన సమయంలో ఆస్పత్రికి విధించిన నిబంధనల ప్రకారం పేదలకు ఉచిత వైద్యం అందించడం తప్పనిసరి అని కోర్టుకు వివరించారు.
బంజారాహిల్స్‌లోని సుమారు 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు రాయితీపై కేటాయించినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. భూమి కేటాయింపు నిబంధనల ప్రకారం ఆస్పత్రిలోని 25 శాతం ఇన్‌పేషెంట్ బెడ్లు, 40 శాతం ఔట్‌పేషెంట్ సేవలను పేదలకు ఉచితంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు.
క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి చికిత్సలో ఆలస్యం జరిగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని పేర్కొన్న హైకోర్టు, బాధితురాలిని వెంటనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని ఆదేశించింది. వైద్యుల సంప్రదింపులు, నిర్ధారణ పరీక్షలు, కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియోథెరపీ, మందులు, ఇన్‌పేషెంట్ చికిత్స సహా అవసరమైన అన్ని వైద్య సేవలను ఉచితంగా అందించాలని స్పష్టం చేసింది.
అంతేకాకుండా హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి బాధితురాలికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలని హైకోర్టు ఆదేశించింది. బసవతారకం ఆస్పత్రితో పాటు మరో ప్రతివాది ఆస్పత్రి కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాయా లేదా అనే విషయంపై నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 23కి వాయిదా వేసింది.

