ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ (Antibiotic Resistance) వేగంగా పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు సాధారణంగా నయం అయ్యే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా ఇప్పుడు చికిత్సకు కష్టతరంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సాధారణ శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్సలు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
బ్రునెల్ యూనివర్సిటీ లండన్‌కు చెందిన డా. సామ్ విల్కాక్స్ తెలిపిన వివరాల ప్రకారం, యాంటీబయాటిక్స్‌కు మన శరీరం కాదు, బ్యాక్టీరియానే నిరోధక శక్తిని (Resistance) అభివృద్ధి చేసుకుంటాయి. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఎక్కువశాతం బ్యాక్టీరియా చనిపోతాయి. అయితే కొన్నివి మందులకు తట్టుకుని బతికి, మళ్లీ పెరిగి అదే మందు ప్రభావాన్ని తగ్గిస్తాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వైరల్ జ్వరాలు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులకు అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడటం, వైద్యుల సలహా లేకుండా స్వయంగా మందులు తీసుకోవడం, అలాగే పశుసంవర్థక రంగంలో అధికంగా యాంటీబయాటిక్స్ వినియోగించడం ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల కేవలం ఇన్ఫెక్షన్ల చికిత్సే కాదు.. శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్సలు, కీళ్ల మార్పిడి వంటి అనేక వైద్య సేవలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీనిని "నిశ్శబ్ద మహమ్మారి" (Silent Pandemic)గా అభివర్ణిస్తున్నారు.
ఈ సమస్యను తగ్గించాలంటే వైద్యుల సూచన మేరకే యాంటీబయాటిక్స్ వాడాలి, అవసరం లేకుండా మందులు తీసుకోకూడదు, పూర్తి కోర్సును తప్పకుండా పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కొత్త మందుల అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా వినియోగించడం అత్యంత ముఖ్యమని వారు స్పష్టం చేస్తున్నారు.
📝 గమనిక: ఈ సమాచారం వివిధ జాతీయ, అంతర్జాతీయ వార్తా వనరులు మరియు వైద్య నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ప్రజల అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఆరోగ్య సమస్యలు లేదా మందుల వినియోగానికి సంబంధించిన నిర్ణయాల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి.

