ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కేసులు వెలుగుచూడడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాలో కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా COVID-19 Preparedness Alert ప్రకటించింది. ప్రస్తుతం జిల్లాలో 8 యాక్టివ్ కేసులు ఉండగా, ఇటీవల ఇద్దరు కరోనా సంబంధిత కారణాలతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఇద్దరు మృతి.. మెడికల్ విద్యార్థికి కరోనా పాజిటివ్
రాజంపేటకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి చికిత్స కోసం తమిళనాడులోని సీఎంసీ వెల్లూరులో ఉండగా మృతి చెందారు. మరో 43 ఏళ్ల వ్యక్తి కడప ప్రభుత్వాస్పత్రి COVID ICUలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో కడప మెడికల్ కాలేజీకి చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
ప్రభుత్వం హై అలర్ట్.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు
కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్యశాఖ రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించింది. ప్రభావిత ప్రాంతాల్లో నమూనాలు సేకరించి, వైరస్ వేరియంట్‌ను గుర్తించేందుకు పుణెలోని ప్రయోగశాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.
రద్దీ ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరి
రాష్ట్ర ఇన్చార్జ్ మంత్రి సవిత అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాలు వంటి చోట్ల మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. అలాగే జిల్లా అధికారులు పరీక్షలు, ఐసోలేషన్ వార్డులు, పడకలు, ఆక్సిజన్ సదుపాయాలు మరియు వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ప్రజలకు సూచనలు
ఆరోగ్య నిపుణులు జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

