ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా క్యాన్సర్ కేసులు, క్యాన్సర్ కారణంగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2025లో రాష్ట్రంలో 78,282 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవగా, 42,935 మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. గత ఐదేళ్లలో ఇవే అత్యధిక గణాంకాలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో 2021లో 71,970 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అనంతరం 2022లో 73,536, 2023లో 75,086, 2024లో 76,708, 2025లో 78,282 కేసులకు చేరుకున్నాయి.
అదే విధంగా క్యాన్సర్ కారణంగా మరణాల సంఖ్య కూడా ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది. 2021లో 39,443 మంది, 2022లో 40,307 మంది, 2023లో 41,163 మంది, 2024లో 42,063 మంది, 2025లో 42,935 మంది క్యాన్సర్తో మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ రాష్ట్రాల వారీ అంచనా గణాంకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా చూస్తే, 2025లో భారత్లో మొత్తం 15,69,793 కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 8,68,588 మంది క్యాన్సర్ కారణంగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

