ఉత్తర తెలంగాణలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
ఈ ప్రాంతీయ క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు పరిసర జిల్లాల క్యాన్సర్ రోగులకు ఒకే చోట నాణ్యమైన వైద్యం అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం దానిని అత్యాధునిక పరికరాలు, నిపుణులైన వైద్యులు, తగిన సిబ్బందితో కూడిన సమగ్ర తృతీయ స్థాయి వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
సమీక్షలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై అధికారులు చర్చించారు.
ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న 29 ప్రత్యేక వైద్య విభాగాలకు అదనంగా మరో 9 సూపర్ స్పెషాలిటీ విభాగాలను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిమ్స్ తరహాలో 'లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC)' విధానంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీని ద్వారా అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలు, సేవల నిర్వహణ మరింత సులభం కానుంది.
ఇంకా హనుమకొండలో ఐవీఎఫ్ కేంద్రం, డ్రగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, రీజినల్ ఐ హాస్పిటల్‌ను అత్యాధునిక నేత్ర వైద్య సేవలతో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
అదేవిధంగా ఎంజీఎం ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా అదనపు వైద్య విద్యా సంచాలకుడిని (Additional Director of Medical Education) నియమించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.

