తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్ల స్టైపెండ్ పెంపు డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. తమ స్టైపెండ్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (AYUSH HS&PG-JAC) ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేసింది.
వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆస్పత్రి కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు జేఏసీ నాయకులు 15 రోజుల సమ్మె నోటీసును అందజేశారు. ప్రస్తుతం హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైపెండ్‌ను పెంచాలని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు.
15 రోజుల్లోగా స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 4, 2026 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని జేఏసీ హెచ్చరించింది. ఈ సమ్మెలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 6,000 మంది హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్లు పాల్గొనే అవకాశం ఉందని జేఏసీ నాయకులు తెలిపారు.
స్టైపెండ్ పెంపు కోసం గత పదేళ్లుగా పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రులు, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆయుష్ డైరెక్టర్‌తో కూడా చర్చలు జరిపినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం నెలకు రూ.13,500 స్టైపెండ్ మాత్రమే అందుతున్నట్లు జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బస్రే తెలిపారు. 2016లో ఈ స్టైపెండ్‌ను నిర్ణయించారని, ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 ప్రకారం ఆయుష్ పీజీ స్కాలర్లు, హౌస్ సర్జన్లకు కూడా అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా నెలకు రూ.30,000 స్టైపెండ్ ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
గత పదేళ్లలో జీవన వ్యయం గణనీయంగా పెరిగిందని జేఏసీ నాయకులు తెలిపారు. వసతి, ఆహారం, ప్రయాణం, విద్యతో పాటు రోజువారీ అవసరాల ఖర్చులు పెరిగినప్పటికీ స్టైపెండ్‌లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
జేఏసీ చేపట్టనున్న ఉద్యమానికి కళాశాలలోని అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా పూర్తి మద్దతు ప్రకటించినట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైపెండ్ పెంపుపై నిర్ణయం తీసుకోవాలని, సమ్మె పరిస్థితి రాకుండా సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

