తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) పేరును డా. మారి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా మార్చింది.
మాజీ ముఖ్యమంత్రి డా. మారి చెన్నారెడ్డి సేవలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చోంగ్తూ జూలై 30న G.O.Ms. No. 63 ఉత్తర్వులు జారీ చేశారు.
ఇకపై ఆసుపత్రి పేరు అధికారిక రికార్డులు, పరిపాలనా వ్యవహారాలు, సైన్‌బోర్డులు, ప్రజా వినియోగం వంటి అన్ని సందర్భాల్లో డా. మారి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సనత్‌నగర్గా కొనసాగనుంది.
డా. మారి చెన్నారెడ్డి తెలంగాణ అభివృద్ధికి, ప్రజా జీవితానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పేరు మార్పు చేపట్టినట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కార్యాలయం వెల్లడించింది.

