కీళ్లు, ఎముకల నొప్పులతో కూడిన కీళ్లవాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఒకప్పుడు కేవలం వృద్ధాప్యానికే పరిమితమైన వ్యాధి. కానీ నేడు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల మితిమీరిన వాడకం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, విటమిన్ -డి, కాల్షియం లోపాల వల్ల 25 నుంచి 40 ఏళ్ల లోపు యువత సైతం ఈ సమస్య బారిన పడుతున్నారు. ప్రారంభంలో సాధారణ అలసటగా భావించి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కాలక్రమేణా కీళ్లు శాశ్వతంగా దెబ్బతిని, నడవడం కూడా కష్టంగా మారుతోంది.
ఇలాంటి తీవ్ర ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతూ, మోకాలి మార్పిడి (Knee Replacement) వంటి పెద్ద శస్త్రచికిత్సలకు భయపడే రోగుల కోసం వైద్య శాస్త్రం ఒక సరికొత్త ఆశాకిరణాన్ని తీసుకువచ్చింది. మోకాలి ఆపరేషన్ అవసరం లేకుండానే నొప్పి, వాపుల నుంచి శాశ్వత ఉపశమనం కలిగించే ‘జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ (GAE - Genicular Artery Embolization) అనే ఆధునిక చికిత్సా విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
ఏమిటీ ‘జీఏఈ’ (GAE) విధానం..?
సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ ముదిరినప్పుడు మోకాలి కీళ్ల భాగంలో ఉండే రక్తనాళాల్లో వాపు (Inflammation) ఏర్పడి, విపరీతమైన నొప్పి పుడుతుంది.
ఈ సరికొత్త విధానంలో... చికిత్సా పద్ధతి..ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు ఒక చిన్న కాథెటర్ అంటే సన్నని గొట్టం ద్వారా మోకాలిలోని సదరు వాపునకు గురైన రక్తనాళాల్లోకి సూక్ష్మ కణాలను (Micro-beads) పంపుతారు.
పనితీరు..? ఈ మైక్రో-బీడ్స్ అక్కడి అదనపు రక్త ప్రసరాన్ని అడ్డుకోవడం ద్వారా మోకాలి లోపలి వాపును గణనీయంగా తగ్గిస్తాయి. ఫలితంగా రోగికి నొప్పి నుంచి వేగవంతమైన, దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుంది.
పరిశోధనల్లో వెల్లడైన అద్భుత ఫలితాలు..
అమెరికాలోని ప్రసిద్ధ ‘యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అన్షుట్జ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ పరిశోధకులు, వైద్యులు జరిపిన అధ్యయనాల ప్రకారం ఈ సరికొత్త చికిత్స అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు రుజువైంది.
70 శాతం మందిలో విజయం..
ఈ ప్రక్రియ చేయించుకున్న రోగులలో దాదాపు 70 శాతం మంది అద్భుత ఫలితాలను పొందారు. మెజారిటీ రోగులలో నొప్పి సగానికి పైగా తగ్గగా, కొందరిలో నొప్పి పూర్తిగా నయమైంది.
తేలికపాటి సమస్యలకు అత్యుత్తమం..
ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ లీ కాసాడబన్ కథనం ప్రకారం.. తేలికపాటి నుంచి మధ్యస్థ (Mild to Moderate) ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులలో ఈ చికిత్స అద్భుత ఫలితాలను ఇస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్న వారికి కూడా ఇది చేయవచ్చినప్పటికీ, ఉపశమన కాలపరిమితి కొద్దిగా తక్కువగా ఉండవచ్చు.
శస్త్రచికిత్సతో సమానమైన ఉపశమనం: గతంలో ఒక మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఇబ్బందులు పడి, రెండో మోకాలికి ఈ సరికొత్త 'జీఏఈ' పద్ధతిని ఎంచుకున్న 74 ఏళ్ల సింథియా ష్రాఫ్-ఫ్లెచర్ అనే వృద్ధురాలి అనుభవం దీనికి నిదర్శనం. ఈ చికిత్స తర్వాత ఆమె ఎలాంటి సర్జరీ లేకుండానే ఏడాది కాలంగా తోటపని, సైక్లింగ్ వంటి పనులను చేసుకోగలుగుతున్నారు.
మందులు, ఫిజియోథెరపీ, కీళ్ల ఇంజెక్షన్లు వాడినా ఫలితం లేని వారికి మరియు మోకాలి మార్పిడి సర్జరీ వద్దు అనుకునే వారికి ఈ సరికొత్త మైక్రో-బీడ్స్ థెరపీ ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. కీళ్లవాతాన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే బయోలాజిక్ మందులు, అధునాతన ఫిజియోథెరపీల ద్వారా నయం చేయవచ్చని, ముదిరిన స్థితిలో ఇలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని శస్త్రచికిత్స లేకుండానే మళ్లీ హాయిగా నడవవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

