మారుతున్న కాలం, ఉరుకులు పరుగుల జీవితం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జంక్ ఫుడ్, నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి ఆధునిక దినచర్యలో భాగమైపోయాయి. అయితే, ఈ పాశ్చాత్య జీవనశైలి మనల్ని ఎంతటి ప్రమాదంలోకి నెడుతోందో వివరిస్తూ 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR)' తాజా అధ్యయనం పలు సంచలన విషయాలను వెల్లడించింది.
పెరుగుతున్న కేసులు..
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని ప్రాణాంతక వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడుతుంటే, భారత్‌లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని ఐసీఎంఆర్ పేర్కొంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ (Breast Cancer), పురుషుల్లో నోటి క్యాన్సర్ (Oral Cancer) కేసులు గత రెండు దశాబ్దాలుగా అనూహ్యంగా పెరుగుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరగడానికి కారణాలు..
భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధానంగా మన పాశ్చాత్య జీవనశైలే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో ఈ క్యాన్సర్ ముప్పు పెరగడానికి దోహదం చేస్తున్న ప్రధాన కారకాలు:
శారీరక శ్రమ లోపించడం.. గంటల తరబడి కూర్చుని పనిచేయడం, రోజువారీ వ్యాయామం లేకపోవడం.
స్థూలకాయం.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో బరువు పెరగడం.
హార్మోన్ల మార్పులు..చాలా చిన్న వయసులోనే బాలికలు రజస్వల కావడం.
కెరీర్ కోసం వాయిదా..వృత్తిపరమైన బాధ్యతలు, లక్ష్యాల కోసం ఆలస్యంగా గర్భం దాల్చడం.
తల్లిపాలు..పుట్టిన బిడ్డకు తగినంత కాలం పాటు తల్లిపాలు ఇవ్వకపోవడం.
ఆ వ్యసనాలతోనే నోటి క్యాన్సర్..
మహిళల పరిస్థితి ఇలా ఉంటే, పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీనికి కొత్త కారణాలేమీ లేవు, దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న చెడు అలవాట్లే ప్రధాన శత్రువులు.
గుట్కా, పాన్ మసాలా, పొగాకు నమలడం, మద్యపానం లాంటి వ్యసనాల వల్ల నోటి క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది.
ఈ వ్యసనాలకు బానిసలవడం వల్ల ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతున్నట్లు నివేదిక తేల్చి చెప్పింది.
సర్వైకల్ క్యాన్సర్ తగ్గుముఖం..!
ఈ నివేదికలో భారతీయులకు ఒక ఊరటనిచ్చే అంశం కూడా ఉంది. దేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) కేసులు గణనీయంగా తగ్గాయి.
మహిళల్లో ఆరోగ్యపరమైన అవగాహన పెరగడం
మెరుగైన వ్యక్తిగత పరిశుభ్రత (Personal hygiene) పాటించడం
ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం
ఈ మూడు కారణాల వల్లే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను చాలావరకు కట్టడి చేయగలిగామని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.

