న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులకు మరింత సులభంగా ఆరోగ్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆయుష్మాన్ సారథి (Ayushman Sarathi)' పేరుతో వాట్సాప్ చాట్‌బాట్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా ప్రారంభించారు.
ఈ చాట్‌బాట్‌ను నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) రూపొందించింది. ఇకపై ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించిన చాలా సేవలను నేరుగా వాట్సాప్‌లోనే పొందే అవకాశం లభించనుంది.
వాట్సాప్‌లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి?
ఆయుష్మాన్ సారథి చాట్‌బాట్ ద్వారా...
మీరు ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులా కాదా తెలుసుకోవచ్చు.
కొత్త ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఉన్న కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
eKYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చు.
గతంలో పొందిన చికిత్స వివరాలను చూడవచ్చు.
సమీపంలోని ఆయుష్మాన్ గుర్తింపు పొందిన ఆస్పత్రులను తెలుసుకోవచ్చు.
ఫిర్యాదులు కూడా వాట్సాప్‌లోనే
కేవలం ఆరోగ్య సేవలే కాకుండా...
ఫిర్యాదు నమోదు చేయడం,
ఫిర్యాదు స్థితి తెలుసుకోవడం,
అవసరమైతే ఫిర్యాదును ఉపసంహరించుకోవడం,
కాల్‌బ్యాక్ కోరడం,
ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వంటి సేవలు కూడా ఈ చాట్‌బాట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఆస్పత్రిలో చికిత్స పూర్తైన తర్వాత సేవలపై తమ అభిప్రాయాన్ని కూడా లబ్ధిదారులు నేరుగా వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు.
ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది?
ఇప్పటి వరకు ఈ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలు లేదా హెల్ప్‌లైన్‌లను సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం చేతిలో ఉన్న మొబైల్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి చాలా పనులను కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసుకోవచ్చు.
దీంతో సమయం ఆదా కావడంతో పాటు, ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరింత మందికి సులభంగా చేరే అవకాశం ఉంది.
ప్రభుత్వానికి కూడా ఉపయోగమే
ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్, ఫిర్యాదుల ఆధారంగా సేవల్లో ఎక్కడ సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం త్వరగా గుర్తించగలదు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం అమలు ఎలా జరుగుతుందో కూడా మరింత సమర్థంగా పర్యవేక్షించవచ్చు.
డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ సేవలను కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. కోట్లాది మంది లబ్ధిదారులు ఇకపై ఆరోగ్య పథకానికి సంబంధించిన సేవలను సులభంగా, వేగంగా వినియోగించుకునే అవకాశం పొందనున్నారు.

