భానుడి భగభగలు, ఉక్కపోత కారణంగా వేసవి కాలంలో అనేక చర్మ సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో విపరీతమైన చెమట, దుమ్ము, తేమ మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. ఒళ్లు దురద. కొన్నిసార్లు ఈ దురద ఎంత తీవ్రంగా మారుతుందంటే, పగలు రాత్రి తేడా లేకుండా తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. నిరంతరాయంగా గోకడం వల్ల చర్మం ఎర్రబడటం, దద్దుర్లు రావడం మరియు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పెరుగుతుంది.
నిపుణుల ప్రకారం, వేసవిలో అధిక చెమట వల్ల బ్యాక్టీరియా చేరడం, చర్మంలో తేమ తగ్గడ, అలర్జీలు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ దురద వస్తుంది. అయితే, ప్రాథమిక దశలో ఉన్న తేలికపాటి సమస్యకు వంటింట్లోనే దొరికే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం...
దురద నుంచి ఉపశమనానికి గృహ చిట్కాలు..
కలబంద (అలోవెరా) జెల్..
కలబందలో చర్మాన్ని చల్లబరిచే గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మపు చికాకును, మంటను తగ్గిస్తుంది. తాజా కలబంద జెల్‌ను దురద ఉన్న చోట రాసి.. 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
చల్లటి నీటి స్నానం..
వేసవిలో దురద ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నీళ్లకు దూరంగా ఉండాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న చల్లని నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తక్షణమే చల్లబడి, దురద తీవ్రత తగ్గుతుంది.
గుణకారి కొబ్బరి నూనె..
చర్మం పొడిబారడం వల్ల దురద వస్తుంటే కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మానికి అవసరమైన తేమను అందించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
చల్లనైన దోసకాయ..
దోసకాయలో ఉండే చల్లదనపు గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దోసకాయ ముక్కలను దురద ఉన్న చోట ఉంచడం లేదా దాని రసాన్ని పూయడం వల్ల చర్మంపై వచ్చే చికాకు, మంట త్వరగా తగ్గుతాయి.
ఔషధాల గని వేప నీరు..
వేప ఆకులలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని స్నానం చేసే బకెట్ నీళ్లలో కలుపుకుని స్నానం చేయడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, దురదలు నయమవుతాయి.
చర్మవ్యాధి నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి..?
ఈ గృహ చిట్కాలు కేవలం తేలికపాటి సమస్యలకే ఉపయోగ పడతాయి. ఒకవేళ ఒళ్లు దురద కొన్ని రోజుల పాటు అలాగే కొనసాగుతున్నా.. చర్మంపై విపరీతమైన వాపు, పుండ్లు, బొబ్బలు లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. వేసవిలో కాటన్ వస్త్రాలు ధరించడం, రోజుకు రెండుసార్లు స్నానం చేయడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పుష్కలంగా నీరు తాగడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..!

