ప్రపంచాన్ని ఏదో ఒక కొత్త వైరస్ ఎప్పుడూ భయపెడుతూనే ఉంది. కరోనా, నిపా, మంకీపాక్స్ వంటి మహమ్మారుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ.. తాజాగా ‘హంటావైరస్’ (Hantavirus) ఆందోళన కలిగిస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక క్రూయిజ్ షిప్లో ఈ వైరస్ ప్రబలడంతో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఎలుకల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిశితంగా పర్యవేక్షిస్తోంది.
దేనివల్ల వస్తుంది..?
హంటావైరస్ ప్రధానంగా ఎలుకలు, ఉడుతల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, లాలాజలం లేదా మలం కలిసిన పరిసరాలను తాకడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. అరుదైన సందర్భాల్లో ఇది మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 35 నుంచి 60 శాతం వరకు ఉండటం దీని తీవ్రతకు అద్దం పడుతోంది.
ఫ్లూలా కనిపించినా.. ప్రాణాంతకం..!
వ్యాధి సోకిన తొలినాళ్లలో ఇది సాధారణ ఇన్ ఫ్లుయెంజా (ఫ్లూ) మాదిరిగానే కనిపిస్తుంది. దీంతో రోగులు ప్రాథమిక దశలో దీనిని గుర్తించలేకపోతున్నారు. మొదట్లో జ్వరం, చలి, తలనొప్పి, విపరీతమైన కండరాల నొప్పులు ఉంటాయి.
ముదిరిన తర్వాత.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఊపిరితిత్తుల్లో ద్రవాలు పేరుకుపోయి (పల్మనరీ సిండ్రోమ్), గుండె వేగం పెరుగుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థతో పాటు మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే అవయవాల వైఫల్యంతో మరణం సంభవించవచ్చు.
ట్రీట్మెంట్ ఏంటి..?
హంటావైరస్ను పూర్తిగా నయం చేయడానికి ప్రస్తుతం నిర్దిష్టమైన మందులు లేదా టీకాలు అందుబాటులో లేవు. కేవలం లక్షణాల తీవ్రతను బట్టి ఆక్సిజన్ అందించడం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
నివాస ప్రాంతాల్లో ఎలుకలు చేరకుండా జాగ్రత్త వహించాలి. ఎలుకల రెట్టలు ఉన్న చోట చీపురు లేదా వాక్యూమ్ క్లీనర్ వాడకూడదు. దీనివల్ల వైరస్ గాలిలో కలిసి పీల్చే ప్రమాదం ఉంది. ఎలుకలు ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు తప్పనిసరిగా గ్లౌవ్స్, మాస్క్ ధరించాలి. బ్లీచింగ్ పౌడర్ లేదా డిసిన్ఫెక్టెంట్లను వాడాలి.ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగిన తర్వాత ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అరుదైన వ్యాధి అయినప్పటికీ, దీని ప్రాణాంతక స్వభావం దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

