చాలామంది ఆరోగ్యంగా ఉండటానికి పౌష్టికాహారం తింటుంటారు, రోజూ జిమ్‌కు వెళ్లి గంటల తరబడి వ్యాయామం కూడా చేస్తుంటారు. అయినా సరే బరువు తగ్గకపోవడం, ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా, అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. 'అన్నీ సక్రమంగానే చేస్తున్నా ఎందుకు ఇలా జరుగుతోంది?' అని వీరంతా మదనపడుతుంటారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పగటిపూట ఎంత జాగ్రత్తగా ఉన్నా, సాయంత్రం, రాత్రి వేళల్లో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే ఇందుకు ప్రధాన కారణం..! మన శరీర గడియారం అంటే బయోలాజికల్ క్లాక్ సంధ్యా సమయం తర్వాత భిన్నంగా పనిచేస్తుంది. ఆ సమయంలో మన అలవాట్లు సరిగ్గా లేకపోతే ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది.
రాత్రి సమయం.. శరీరానికి 'మరమ్మత్తు' సమయం..!
వైద్య నివేదికల ప్రకారం.. పగటిపూట అలసిపోయిన శరీర కణాలు తమను తాము మరమ్మత్తు చేసుకోవడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి, మెదడు ఉత్తేజితం కావడానికి రాత్రి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. కానీ, మనం రాత్రిపూట పాటించే కొన్ని చెడు అలవాట్లు ఈ సహజ ప్రక్రియకు అడ్డుకట్ట వేస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
1. గాడ్జెట్లతో కాలక్షేపం.. మెలటోనిన్ లోపం..!
పని ముగించుకుని ఇంటికి వచ్చాక గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం లేదా టీవీల ముందు గడపడం మనకు అలవాటుగా మారింది. ఈ డిజిటల్ స్క్రీన్ల నుంచి వెలువడే 'నీలి కాంతి' (బ్లూ లైట్) మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది నిద్రకు కారణమయ్యే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా నిద్రలేమి, నిద్ర చక్రం దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే మొబైల్, ల్యాప్‌టాప్‌లను పక్కన పెట్టేయాలి.
2. సాయంత్రం దాటాక జంక్ ఫుడ్.. నెమ్మదించే జీర్ణక్రియ..!
పని ఒత్తిడి వల్ల చాలామంది రాత్రి వేళల్లో ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. మరికొందరు సాయంత్రం పూట పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, నూనెలో బాగా వేయించిన పదార్థాలను తింటుంటారు. సూర్యాస్తమయం తర్వాత మన శరీరంలో జీర్ణక్రియ వేగం క్రమంగా నెమ్మదిస్తుంది. ఈ సమయంలో భారీగా లేదా కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం మరియు అదనపు క్యాలరీలు కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోయి బరువు పెరుగుతారు.రాత్రి భోజనాన్ని వీలైనంత వరకు రాత్రి 8 గంటల లోపే ముగించాలి. తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆరోగ్య సంరక్షణకు నిపుణులు సూచిస్తున్న సులువైన సూత్రాలు..
కెఫిన్‌కు దూరం: రాత్రి వేళల్లో లేదా అర్ధరాత్రి దాటిన తర్వాత టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. ఇందులోని కెఫిన్ నిద్రను దూరం చేస్తుంది. నిద్రపోవడానికి, ఉదయం నిద్ర లేవడానికి ప్రతిరోజూ ఒకే నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి.
రాత్రి భోజనం చేసిన వెంటనే పడకపైకి చేరకుండా.. కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు సాపీగా నడవాలి. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. పగటిపూట చేసే వ్యాయామం, తీసుకునే పౌష్టికాహారం శరీరానికి పూర్తి స్థాయిలో మేలు చేయాలంటే.. రాత్రి వేళల్లో క్రమశిక్షణతో కూడిన అలవాట్లు కూడా అంతే ముఖ్యం. కాబట్టి, నేటి నుంచే మీ సాయంత్రపు దినచర్యను మార్చుకోండి.. సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి..!

